Andhraprabha
Last Updated May 19 2012, 02:22:26, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు (Ads)
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

తూర్పు గోదావరి 

జ్ఞానానందకవి అస్తమయం

apr -   Fri, 7 Jan 2011, IST
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

(కాకినాడ, కెఎన్‌ఎన్‌ ప్రతినిధి) కూలీ నుండి పద్మశ్రీ వరకు ఎదిగిన సురగాలి తిమోతి జ్ఞానానందకవి జీవితం విషాదంగానే ముగిసింది. ఇది కవులతో పాటు సామాజిక భావాలు కలిగిన అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. సామాన్యుడి నుండి కవిసార్వభౌముని వరకు అంచెలంచెలుగా ఎదిగిన జ్ఞానానందకవి సాహితీ లోకంలో దీర్ఘకాలం పాటు అత్యద్భుతంగా ప్రకాశించారు. కవి కోకిలగా.. కవితా విశారదగా...కవి లోక విభూషణుడిగా...సాహితీ వల్లభునిగా ... అధ్య, విద్యప్రభువునిగా ఇలా అనేక అంశాలలో తనదైన శైలిలో సాహత్యాన్ని పోషించారు. బాల్యం నుండే రచనాసక్తిని చేపట్టిన జ్ఞానందకవి చివరివరకు అకుంతాసక్తిని కనబరిచారు. పలు రచనలు చేసి సాహతీ లోకంలో ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్నారు. సహజ కవితావేశబంధుర హృదయుడైన ఆయన తన కలం ద్వారా అలవోకగా రచనలు చేసి సాహితీ భూమిపై పాదుకొల్పారు. అవి నేడు వృక్షాలై ఎందరికో మార్గదర్శకంగా నిలిచాయి. వేలాదిమంది సాహితీప్రియుల్నుంచి ఆయన ఇప్పటికీ గాడ్‌ఫాదర్‌గా గౌరవాన్నందుకుంటున్నారు. తెలుగుబాషపై అపార ప్రతిభతో సాహితీ కృషివరులకు, సాహితీ ప్రయులకు సంబ్రమాశ్చర్యాల్ని కలిగించే రీతిలో ఆయనచేసిన రచనలు దేశ విదేశాల్లో బహుళ ప్రాచుర్యంపొందాయి. 1944లో తరంగ మాల కావ్యం ద్వారా తన రచనా ప్రాభవాన్ని చాటుకుని 40పైగా రచనల్తో తెలుగు సాహితీ జగత్తులో అనేక బిరుదులు స్వీకరించారు.

జ్ఞానానందకవి రచనలు

వసంతగానం(1947), గాంధీ (1950), దేశబంధు, పాంచజన్యము (1956), ప్రభంజనం, పర్జన్యం (తొలి భాగము)(1959), గోల్కొండ, క్రీస్తు చరిత్ర (1963), విజయాభిషేకం (1966), పర్జన్యం(రెండో భాగము)(1969), అక్షరాభిషేకం (1971), ఆమ్రపాలి (1972), అక్షరాక్షతలు (1973), అక్షరగుచ్చము (1975), వెలుగుబాట (1976), క్రీస్తు ప్రబంధం (1977), క్రీస్తుప్రబంధం తొలిభాగము (1992), నా జీవిత గాథ తొలిభాగం (1977), అక్షరపూజ (1979), హరిజనులు అంటరానివారా (1980), పిల్లనగ్రోవి (1982), రాజధాని (1987), వంశధార(1989), ది విజన్‌ ఇన్‌ ది వర్సస్‌ ఆఫ్‌ డాక్టర్‌ జ్ఞానందకవి (1990), కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు (1988), ధర్మాగ్రహము (1998), వివేకానందగానం(2004), రెండు వేల పద్యాలతో క్రీస్తు ప్రబంధం, మనదేశం, రోజలుమారాలి (లఘునాటిక) బాష్ప సందేశం, పిల్లనగ్రోవి, రాజధాని, ఆహ్వానం, రెండంకితాలు, ఆరుదశాబ్ధాల కవితా పరిశ్రమ, అభినందన పద్యగద్య వ్యాససంపుటిలతో పాటు జ్ఞానందకవి చేసిన మరి కొన్ని రచనలు బహుళ ప్రాచుర్యం పొందాయి.

బిరుదులు

విజయనగరం జిల్లాలో 1987 డిశంబర్‌ 7న కవితా విశారద, విజయవాడలో 1950 మే 20వ తేదీన కవికోకిల, కాకినాడలో 1961ఏప్రిల్‌ 24న కవిలోక విభూషణ, 1968నవంబర్‌ 10వ తేదీన విద్వత్‌కవిచూడామణి, 1968నవంబర్‌ 15వ తేదీన సాహితీవల్లభ, 1974 జనవరి 27న మహాకవి, 1979 అక్టోబర్‌ 28న కవిసార్వభౌమ, 1991 ఫిబ్రవరి 7వ తేదీన బ్రహ్మీ విభూషణ, విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో 1974 ఆగష్టు 3వ తేదీన కళాప్రపూర్ణ, విజయవాడలో 1974 సెప్టెంబర్‌ 29వ తేదీన అభినవ జాషువ, బొబ్బిలి చిలుకలపల్లిలో 1975సెప్టెంబర్‌ 28వ తేదీన సాహితీ కృషి వల, రామచంద్రపురంలో 1982 సెప్టెంబర్‌ 28వ తేదీన కవితాశ్రీనాధ, 1982లో పద్యవిద్యాప్రభు, 1996లో డి.లిట్‌, 2001లో పద్మశ్రీ బిరుదులను స్వీకరించారు.

విద్యాబ్యాసం

1922జూలై 16వ తేదీన విజయనగరం జిల్లా బలిజపేట మండలం పెదపెంకి గ్రామంలో జన్మించిన జ్ఞానానందకవి ఆరవఏటే రచనలు రాయడం ప్రారంభించారు. భీమునిపట్నం బోర్డింగ్‌ స్కూల్‌లో 8వ తరగతి వరకు విద్యాభ్యాసానంతరం కాకినాడలో ఉపాధ్యాయశిక్షణ పొందారు. అనంతరం ఆయన తొలిసారిగా 14వ ఏటనే అప్పటి విశాఖ జిల్లా అలజంగి గ్రామంలో తెలుగుపండిట్‌గా ఉపాధ్యాయవృత్తి చేపట్టారు. 1982లో పదవీ విరమణ చేసేనాటికి 512రూపాయలను వేతనంగా స్వీకరించేవారు. ఈయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం మరో ఐదేళ్ళ పాటు సర్వీసును పెంచినప్పటికి వేతనం చెల్లింపులో మాత్రం నిర్లక్ష్యం వహించింది.

చేపట్టిన పదవులు

జ్ఞానానందకవి రాష్ట్రంలో పలు గౌరవ పదవుల్ని చేపట్టి వాటికి వన్నెతెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం, ఆంద్రప్రదేశ్‌ లైబ్రరీ యాక్ట్‌ రివ్యూ కమిటీ, ఆంధ్రప్రదేశ్‌ సాహితీ అకాడమీ, ఆంధ్రవిశ్వవిద్యాలయ అకాడమీ కౌన్సిల్‌, తూర్పు గోదావరి జిల్లా రెడ్‌క్రాస్‌ సంఘం, తూర్పుగోదావరి జిల్లా గ్రంథలాయ సంస్థ సభ్యుడిగా పలు పదవులు నిర్వహించారు. రచనలు చేయడంతో జ్ఞానానందకవి సాహితీ సంస్థలను ఏర్పాటు చేయడంపై ప్రత్యేక శ్రద్ద కనబరిచారు. 1967లో సాహితీ సమాఖ్య, 1972లో సాహిత్య కళాపీఠం, 1980లో జాషువాకవి సాహిత్య పీఠాల్ని ఏర్పాటు చేశారు.

ప్రముఖుల ప్రశంసలు

జ్ఞానందకవి రచనలను శ్లాఘించిన వారిలో కవిసామ్రాట్‌ డాక్టర్‌ విశ్వనాధ సత్యనారాయణ, డాక్టర్‌ బెజవాడ గోపాల్‌లెడ్డి, ఆచార్యరంగ, డాక్టర్‌ సి నారాయణరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు, డాక్టర్‌ దివాకర్ల వెంకటావధాని, ఆంధ్రసారస్వత రిషదధ్వక్షులు దేవులపల్లి రామానుజరావు, బ్రహ్మీభూషణ కాకకపర్తి కృష్ణశాస్త్రి, జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, డాక్టర్‌ నందూరి రామకృష్ణమాచార్య, డాక్టర్‌ కులుకలూరి ఇనక్‌, ఆర్‌ఎస్‌ సుదర్శనం, కవిరాజ మూర్తిలతో పాటు అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రత్యేకంగా అభినందించిన వారిలో ఉన్నారు. భారత మాజీ రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ నుండి జ్ఞానందకవి అత్యున్నతమైన పద్మశ్రీ అవార్డును స్వీకరించారు.

కుటుంబ వివరాలు

సురగాలి ఎలయ్య, పాపమ్మ దంపతులకు 1922లో జ్ఞానందకవి జన్మించారు. మారెటి తల్లి పోలమ్మ సమక్షంలోఆయన పెరిగి పెద్దవారయ్యారు. అనంతరం ఆయనకు సుగుణ మణితో వివాహం జరుగగా ముగ్గురు కుమారులు, ఇరువురు కుమార్తెలు కలిగారు. వీరిలో ఒకబ్బాయి యుక్తవయస్సులోనే మరణించగా మిగిలిన వారు వివిధ హోదాలలో ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారు. చివరిదశలో ఆయన దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. నడకుదురులోని జనావళి అనాధాశ్రమంకు చెందిన మందపల్లి శ్యామ్‌ ఆయన్ను ఆదరించి చివరివరకు ఆయనకు సదుపాయాలు కల్పించారు. మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ నెలకు రెండువేల చొప్పున కొన్నాళ్ళపాటు ఆయనకు ఆర్ధికసాయాన్నందించారు. నగరానికి చెందిన మరికొంతమంది ఆయనకు ఆర్ధికసాయం చేసి సహకరించారు. చివరివరకు సాహిత్యసేవలోనే గడిపిన ఆయన జీవితం ధన్యం.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

తూర్పు గోదావరి ఇతర విశేషాలు

  • బాబు పర్యటన సాగుతుందిలా..!
  • కొనసాగుతున్న ఇసుక దందా
  • మూతపడ్డ బెల్టుషాపులు
  • ఐఐటి జెఇఇలో నారాయణకు ర్యాంకులు
  • మధురాతిమధురం.... మామిడిఫలం
  • బలవంతపు సేవ
  • నిబంధనలు బేఖాతర్‌
  • బతుకంత బాధలు...
  • నోటిఫికేషన్‌ జారీ

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు (Ads) | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha Publications Ltd. No part of this site should be used in any other media without prior permission.